- వరంగల్వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
హనుమకొండ, వెలుగు: పదేండ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిలో చేసి చూపిస్తున్నామని వరంగల్ వెస్ట్ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంట నిలబడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తానని స్పష్టం చేశారు. టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన ట్విట్టర్ వేదికగా నిర్వహించిన మీటింగ్ లో నాయిని పాల్గొని మాట్లాడారు. అక్రమంగా సంపాదించిన ధనంతో ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా తప్పడు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు.
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతిపక్ష పార్టీల వైఖరిని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వెనక్కి వెళ్లిన స్మార్ట్ సిటీ నిధులను తిరిగి తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగిస్తున్నామని చెప్పారు. రూ.90 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం, రూ.84 కోట్లతో నయీంనగర్బ్రిడ్జి, రూ.60 కోట్ల స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు, రూ.30 కోట్లతో భద్రకాళీ అమ్మవారి మాడ వీధులు చేపట్టామన్నారు.
రూ.6 కోట్లతో గోకుల్ నగర్ జంక్షన్ నుంచి రాజాజీ నగర్ వరకు సైడ్ డ్రైన్, రూ.28 కోట్లతో నూతన పాలిటెక్నిక్ భవన నిర్మాణం, రూ.50 కోట్లతో వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల రిపేర్లు, రూ.10 కోట్ల సీడీపీ నిధుల అభివృద్ధి, రూ.2 కోట్లతో బాలసముద్రం నూతన బీటీ రోడ్డు నిర్మాణం, రూ.15 కోట్లతో జంక్షన్ల అభివృద్ధి చేపట్టినట్లు వివరించారు.